శత్రువు బలవంతుడయినపుడు అతడిని
జయించేందుకు మరొక మహా బలవంతుడిని ప్రేరేపించి ఎవరయినా విజయాన్ని సాధించవచ్చని ఉదంకుడి కథ
వివరిస్తోంది. పరీక్షిత్తు
మహారాజు తక్షకుడి కాటుకు గురై మరణించే సమయానికి అతడి కొడుకు జనమేజేయుడు బాలుడు. ఆ బాలుడికే ఆనాటి మంత్రులు పట్టాభిషేకం చేశారు.
ఒక సందర్భంలో ఉదంకుడు తక్షకుడు చేసిన
అన్యాయానికి గురైయ్యాడు. ఆ అవమానాన్ని అప్పటికి దిగమింగి ఎలాగయినా తక్షకుడిని జయించాలనే సంకల్పంతో ఉదంకుడు తెలివిగా సమర్థతతో పరిపాలిస్తున్న
జనమేజేయ మహారాజు దగ్గరకు వెళ్ళి అతని తండ్రిని సంహరించినది తక్షకుడే అని అతడిని ఎలాగయినా సంహరించి
ప్రతీకారం తీర్చుకోమని నూరి పోశాడు. దీనికి
కావలసిన సర్పయాగ విధిని వివరించాడు. ఉదంకుడు పైలుడు అనే ముని శిష్యుడు తన గురువుకు దక్షిణగా గురుపత్ని
కోరిన పౌష్యమహారాజు ధరించే శక్తివంతమైన చెవి
కుండలాలను తేవడానికి సంసిద్ధుడయ్యాడు.
కేవలం నాలుగు రోజులలో కుండలాలను తెచ్చి గురుపత్నికి బహూకరించాలి. ఉదంకుడు పౌష్యమహారాజు దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆయన
మన్ననలను పొంది, తనకు కావలసిన కుండలాలను అడిగాడు. పౌష్యమహారాజు తన భార్య దగ్గరకు వెళ్ళి అడగమని చెప్పాడు. ఉదంకుడు
వెనువెంటనే రాణి ఉండే మందిరానికి వెళ్ళి చూశాడు. కాని రాణి కనిపించలేదు. తిరిగి వచ్చి రాజుకు విషయం
వివరించాడు. అపవిత్రంగా వెళ్తే రాణి కనిపించదని
పౌష్యుడు వివరించాడు. ఉదంకుడు వెంటనే శుచి అయి సంధ్యావందనం చేసికొని రాణి మందిరానికి వెళ్ళాడు. తన
గురుపత్ని ఆజ్ఞను వివరించాడు. ఆమె కూడా ఉదంకుడి
విజ్ఞప్తిని మన్నించి కుండలాలను అతడికి ఇస్తూ ఆ కుండలాల కోసం తక్షకుడు అనే సర్పరాజు నిరంతరం పొంచి
ఉన్నాడని ఏమరుపాటుగా ఉంటే ఏ క్షణానయినా అతడు
వాటిని కాజేసుకుపోతాడని జాగ్రత్తగా ఉండమని వివరించింది. ఆజాగ్రత్తలు విని ఆమెకు నమస్కరించి ఉదంకుడు బయలుదేరాడు. దారిలో సంధ్యావందన సమయం
అయింది. ఒక పరిశుద్ధమైన ప్రదేశంలో కుండలాలను ఉంచి ఉదంకుడు స్నానానికి వెళ్ళాడు. అదే అదనుగా ఒక
దిగంబరుడి వేషంలో తక్షకుడు వచ్చి కుండలాలను
చేజిక్కించుకొని పాతాళానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా అతడిని వెంబడిస్తూ పాతాళానికి చేరాడు. కానీ తక్షకుడిని కనుక్కోలేకపోయాడు. వెంటనే సర్పరాజ్య
పాలకులయిన శేషుడిని, పాసుకిని స్తుతించాడు. అప్పుడొక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. తక్షకుడు తనను మోసం చేసిన
సంగతిని వివరించి అతడు తనకు స్వాధీనమయ్యేలా చేయమని కోరుకున్నాడు. ఆ దివ్య పురుషుడు తాను ఎక్కి
వచ్చిన గుర్రం చెవిలో శదు అని చెప్పాడు. ముని
గుర్రం చెవిలో శదగానే చెవిలో నుంచి అగ్ని జ్వాలలు వచ్చి పాతాళాలాన్ని అంతటిని తాకాయి. ఆ అగ్నిజ్వాలల
తాపానికి పాములు తట్టుకొనలేక బయటకు వచ్చాయి.
తక్షకుడు కూడా తట్టుకొనలేక కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. ఉదంకుడు కుండలాలను తీసుకున్న సంతోషంగా
కనిపించక పోయేసరికి దివ్య పురుషుడు విషయమేమిటని
అడిగాడు. కుండలాలను ఈ రోజు లోపలనే గురుపత్నికి ఇవ్వాలని మధ్యలో ఏర్పడిన అవాంతరం వల్ల ఇవ్వలేక
పోతున్నానని అతడు బాధపడుతుండగా దివ్యపురుషుడు తాను
ఎక్కి వచ్చిన గుర్రాన్ని ఇచ్చి ఆ గుర్రం ఎక్కి వెళ్ళమని కళ్ళు మూసి తెరిచేలోగా గురువయిన పౌలుని
ఇంటిముందు ఉండవచ్చని చెప్పాడు. ఉదంకుడు ఆ
విధంగానే చేశాడు. అతడు వెళ్లేసరికి గురువుగారి భార్య స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని సిద్ధంగా ఉన్నది. ఉదంకుడు కుండలాలను ఇవ్వగానే గురువు,
గురుపత్ని ఇద్దరూ ఎంతగానో ఆనందించారు. కానీ ఉదంకుడు తక్షకుడు తనకు చేసిన
అవమానానికి కక్ష పెంచుకొని జనమేజేయుడిని ఆశ్రయించి తన శత్రువుమీద ఉన్న కక్షను బలవంతుడయిన రాజును ప్రేరేపించి సర్పయాగం చేయించి తీర్చుకున్నాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి