సర్వే జనా సుఖినో భవంతు

24, నవంబర్ 2014, సోమవారం

ఉదంకుడు కథ :విశ్వ ధర్మం


శత్రువు బలవంతుడయినపుడు అతడిని జయించేందుకు మరొక మహా బలవంతుడిని ప్రేరేపించి ఎవరయినా విజయాన్ని సాధించవచ్చని ఉదంకుడి కథ వివరిస్తోంది. పరీక్షిత్తు మహారాజు తక్షకుడి కాటుకు గురై మరణించే సమయానికి అతడి కొడుకు జనమేజేయుడు బాలుడు. ఆ బాలుడికే ఆనాటి మంత్రులు పట్టాభిషేకం చేశారు. ఒక సందర్భంలో ఉదంకుడు తక్షకుడు చేసిన అన్యాయానికి గురైయ్యాడు. ఆ అవమానాన్ని అప్పటికి దిగమింగి ఎలాగయినా తక్షకుడిని జయించాలనే సంకల్పంతో ఉదంకుడు తెలివిగా సమర్థతతో పరిపాలిస్తున్న జనమేజేయ మహారాజు దగ్గరకు వెళ్ళి అతని తండ్రిని సంహరించినది తక్షకుడే అని అతడిని ఎలాగయినా సంహరించి ప్రతీకారం తీర్చుకోమని నూరి పోశాడు. దీనికి కావలసిన సర్పయాగ విధిని వివరించాడు. ఉదంకుడు పైలుడు అనే ముని శిష్యుడు తన గురువుకు దక్షిణగా గురుపత్ని కోరిన పౌష్యమహారాజు ధరించే శక్తివంతమైన చెవి కుండలాలను తేవడానికి సంసిద్ధుడయ్యాడు. కేవలం నాలుగు రోజులలో కుండలాలను తెచ్చి గురుపత్నికి బహూకరించాలి. ఉదంకుడు పౌష్యమహారాజు దగ్గరకు వెళ్లి నమస్కరించి ఆయన మన్ననలను పొంది, తనకు కావలసిన కుండలాలను అడిగాడు. పౌష్యమహారాజు తన భార్య దగ్గరకు వెళ్ళి అడగమని చెప్పాడు. ఉదంకుడు వెనువెంటనే రాణి ఉండే మందిరానికి వెళ్ళి చూశాడు. కాని రాణి కనిపించలేదు. తిరిగి వచ్చి రాజుకు విషయం వివరించాడు. అపవిత్రంగా వెళ్తే రాణి కనిపించదని పౌష్యుడు వివరించాడు. ఉదంకుడు వెంటనే శుచి అయి సంధ్యావందనం చేసికొని రాణి మందిరానికి వెళ్ళాడు. తన గురుపత్ని ఆజ్ఞను వివరించాడు. ఆమె కూడా ఉదంకుడి విజ్ఞప్తిని మన్నించి కుండలాలను అతడికి ఇస్తూ ఆ కుండలాల కోసం తక్షకుడు అనే సర్పరాజు నిరంతరం పొంచి ఉన్నాడని ఏమరుపాటుగా ఉంటే ఏ క్షణానయినా అతడు వాటిని కాజేసుకుపోతాడని జాగ్రత్తగా ఉండమని వివరించింది. ఆజాగ్రత్తలు విని ఆమెకు నమస్కరించి ఉదంకుడు బయలుదేరాడు. దారిలో సంధ్యావందన సమయం అయింది. ఒక పరిశుద్ధమైన ప్రదేశంలో కుండలాలను ఉంచి ఉదంకుడు స్నానానికి వెళ్ళాడు. అదే అదనుగా ఒక దిగంబరుడి వేషంలో తక్షకుడు వచ్చి కుండలాలను చేజిక్కించుకొని పాతాళానికి పారిపోయాడు. ఉదంకుడు కూడా అతడిని వెంబడిస్తూ పాతాళానికి చేరాడు. కానీ తక్షకుడిని కనుక్కోలేకపోయాడు. వెంటనే సర్పరాజ్య పాలకులయిన శేషుడిని, పాసుకిని స్తుతించాడు. అప్పుడొక దివ్య పురుషుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. తక్షకుడు తనను మోసం చేసిన సంగతిని వివరించి అతడు తనకు స్వాధీనమయ్యేలా చేయమని కోరుకున్నాడు. ఆ దివ్య పురుషుడు తాను ఎక్కి వచ్చిన గుర్రం చెవిలో శదు అని చెప్పాడు. ముని గుర్రం చెవిలో శదగానే చెవిలో నుంచి అగ్ని జ్వాలలు వచ్చి పాతాళాలాన్ని అంతటిని తాకాయి. ఆ అగ్నిజ్వాలల తాపానికి పాములు తట్టుకొనలేక బయటకు వచ్చాయి. తక్షకుడు కూడా తట్టుకొనలేక కుండలాలను తెచ్చి ఉదంకుడికి ఇచ్చాడు. ఉదంకుడు కుండలాలను తీసుకున్న సంతోషంగా కనిపించక పోయేసరికి దివ్య పురుషుడు విషయమేమిటని అడిగాడు. కుండలాలను ఈ రోజు లోపలనే గురుపత్నికి ఇవ్వాలని మధ్యలో ఏర్పడిన అవాంతరం వల్ల ఇవ్వలేక పోతున్నానని అతడు బాధపడుతుండగా దివ్యపురుషుడు తాను ఎక్కి వచ్చిన గుర్రాన్ని ఇచ్చి ఆ గుర్రం ఎక్కి వెళ్ళమని కళ్ళు మూసి తెరిచేలోగా గురువయిన పౌలుని ఇంటిముందు ఉండవచ్చని చెప్పాడు. ఉదంకుడు ఆ విధంగానే చేశాడు. అతడు వెళ్లేసరికి గురువుగారి భార్య స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని సిద్ధంగా ఉన్నది. ఉదంకుడు కుండలాలను ఇవ్వగానే గురువు, గురుపత్ని ఇద్దరూ ఎంతగానో ఆనందించారు. కానీ ఉదంకుడు తక్షకుడు తనకు చేసిన అవమానానికి కక్ష పెంచుకొని జనమేజేయుడిని ఆశ్రయించి తన శత్రువుమీద ఉన్న కక్షను బలవంతుడయిన రాజును ప్రేరేపించి సర్పయాగం చేయించి తీర్చుకున్నాడు.

18, నవంబర్ 2014, మంగళవారం

ఉత్తరకుమారుడు :విశ్వ ధర్మం

పాండవులు మారువేషాల్లో విరాట మహారాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తుండగా కీచకుడిని భీముడి నర్తనశాలలో వధించాడు. కీచకుని మరణానికి కారకురాలైన ద్రౌపదిని ఉపకీచకులు తమ అన్న శవంతో కట్టి చంపటానికి తీసుకువెళ్ళారు. భీముడు ఉపకీచకులను కూడా వధించాడు. కౌరవులు విరాటుని కొలువులో పాండవులు ఉన్నారని గ్రహించి విరాట మహారాజు గోసంపదను చేజిక్కించుకోవటానికి సుశర్మను దక్షిణ దిక్కువైపు పంపి దక్షిణ గోగ్రహణానికి పథకం సిద్ధం చేశారు. తాము ఉత్తరం దిక్కు నుంచి విరాట మహారాజు గోసంపదను గ్రహించటానికి ఉత్తర గోగ్రహణానికి సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. విరాట మహారాజు త్రిగర్తాధీశుడైన సుశర్మ మీదకు సైన్యాన్ని నడిపించాడు. ఇదే అదనుగా కౌరవులు ఉత్తర గోగ్రహణం చేశారు. ఆ సమయంలో అంతఃపురంలో ఉత్తరకుమారుడు స్త్రీజనుల మధ్యన సరససల్లాపాలతో ఉన్నాడు. ఉత్తర గోగ్రహణం జరిగిందని గోరక్షకుడు వచ్చి చెప్పాడు. తాను వెంటనే కౌరవులను ఓడించి గోవులను తీసుకువస్తానని ఉత్తరకుమారుడు ప్రగల్బాలు పలికాడు. కానీ తన రథాన్ని యుద్ధరంగంలో నడిపించేందుకు తగిన సారథి ఎవరూ దొరకలేదని ఒక సాకు చెప్పి మళ్ళీ స్త్రీలతో సరస సరాగాలకు దిగాడు. బృహన్నలగా రాకుమారి ఉత్తరకు అర్జునుడు నృత్యాన్ని నేర్పుతూ అప్పుడు ఆ కొలువులోనే ఉన్నాడు. జరిగిన విషయాన్నంతా గమనిస్తున్న సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపది అర్జునుడికి వివరించింది. యుద్ధం చేసి కౌరవులను జయించేందుకు అర్జునుడు సంసిద్ధుడైనాడు. ఉత్తరకుమారుడి దగ్గరకు వెళ్లి గతంలో అర్జునుడి రథానికి సారథిగా ఉన్న బృహన్నల మన కొలువులోనే ఉన్నాడని ఖాండవ వన దహనం వంటి అనేక సందర్భాల్లో అర్జునుడి విజయానికి బృహన్నలే కారణమని ఉత్తర కుమారుడికి చెప్పమని అర్జునుడు ద్రౌపదిని పంపించాడు. ద్రౌపది విషయాన్నంతా చెప్పింది. తొలుత బృహన్నల తన వంటి వీరపురుషుడికి రథసారథిగా ఉండటమా అని ఉత్తరుడు కొంత హేళనగా అన్నా తరువాత తప్పింది కాదు. అర్జునుడు బృహన్నలగానే రాకుమారుడి రథానికి సారథ్యం వహించి తన శక్తియుక్తులు అన్నింటినీ ప్రదర్శిస్తూ యుద్ధరంగానికి రథాన్ని నడిపించాడు. ఎదురుగా ఉన్న అనంత కౌరవ సేనావాహినిని చూసేసరికి ఉత్తరుడికి కాళ్ళు వణికాయి. బతికుంటే బలుసాకు తినవచ్చునని రథాన్ని వెనక్కి తిప్పమని ప్రాధేయపడ్డాడు. కానీ వీరుడి లక్షణం వెన్నుచూపడం కాదని వీరోచితంగా పోరాడి శత్రువులను మట్టుపెట్టాలని అర్జునుడు ఉత్తరకుమారుడికి ధైర్యాన్ని నూరిపోశాడు. కేవలం ప్రగల్భాలు పలికి పొద్దుపుచ్చుకూడదని కష్టకాలంలో వీరోచితంగా పోరాడి కష్టాలను ఎదుర్కోవాలని అర్జునుడు చేసిన హితబోధ ఒక్క ఉత్తరకుమారిడికే కాదు ఆరంభ శూరత్వంతోనూ, ప్రగల్బాలతోనూ కాలం వెళ్లదీసే అందరికీ అది చక్కటి బోధామృతం. ఉత్తరకుమారుడు ఆ బోధామృతాన్ని అందించిన అర్జునుడి సహకారంతోనే ఉత్తర గోగ్రహణం సమయంలో విజయాన్ని చేజిక్కించుకోగలిగాడు. అర్జునుడి మాటలలోని ఆత్మస్త్థెర్యాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు.

16, నవంబర్ 2014, ఆదివారం

హయగ్రీవావతారం :విశ్వ ధర్మం

సకల చరాచర సృష్ఠికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్ఠికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రజస్తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు. బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను సృష్ఠిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి. ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు. రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు. వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

14, నవంబర్ 2014, శుక్రవారం

పరీక్షిత్తు మహారాజు :విశ్వ ధర్మం

భారతీయ సంప్రదాయక పురాణాలు, ఇతిహాసాలు అన్నీ మానవాళికి మంచి మార్గాన్ని బోధించటానికే ఆవిర్భవించాయి. జనమేజేయ మహారాజు తండ్రి అయిన పరీక్షిత్తు మహారాజు కథ కూడా మానవులకు ఒక జవీన సందేశాన్ని అందిస్తోంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. దాని ఫలితాన్ని తప్పు చేసిన వాడు అనుభవించి తీరుతారు అన్న సత్యం పరీక్షిత్తు కథలో వెల్లడవుతోంది. పరీక్షిన్మహారాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తూ తన రాజ్యంలో ధర్మం నాలుగు పాదాలా నడిచేలాగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉండేవాడు. అంతటి మహారాజుకు కూడా వ్యసనాలలో ఒకటయిన వేట మీద బాగా ధ్యాస ఉండేది. ఒకనాడు ఆ రాజు అడవిలో వేటాడుతుండగా అతని బాణపు గురిని తప్పించుకుని ఒక మృగం పారిపోయింది. దాని వెంటపడి పరిగెడుతున్న రాజుకు ఒకచోట బాగా అలసట అనిపించింది. దాహం తీర్చుకోవటానికి ఆ పక్కనే కనిపిస్తున్న ఒక ఆశ్రమంలోకి వెళ్ళాడు. అది శమీకుడు అనే ముని ఆశ్రమం. ఆ ముని ఎవరితోనూ సాధారణంగా మాట్లాడడు. ఆ విషయం తెలియని రాజు నా బాణపు గురి నుంచి తప్పించుకున్న ఒక మృగం ఇటు పరిగెత్తుకు వచ్చింది. దానిని మీరు చూశారా అని ప్రశ్నించాడు. ముని జవాబు ఇవ్వలేదు. రాజు కోపంతో తనంతటివాడు వచ్చి అడుగుతున్నా సమాధానం చెప్పనందుకు ముని మీద కోపం పెంచుకున్నాడు. ఆ పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తెచ్చి ఆ ముని మెడలోవేసి తన కోపం చల్లార్చుకుని రాజు వెళ్ళిపోయాడు. శమీక మహర్షికి శృంగి అనే కొడుకు ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన కొద్ది సమయానికి శృంగి అక్కడికి వచ్చి మౌనముద్రలో ఉన్న తన తండ్రిని అవమానించిన వారి మీద విపరీతంగా కోపం తెచ్చుకొని ఈ అవమానమునకు కారణమైనవాడు ఏడు రోజులలోగా తక్షకుడు అనే సర్పరాజు కాటుకు బలి అగుగాక! అని శాపమిచ్చి తన తండ్రి మెడలోని పామును తీసివేసే సమయంలో కళ్లు తెరిచి జరిగినదంతా తెలుసుకున్న శమీకుడు తన కొడుకును మందలించి రాజులు మన వంటి వారి రక్షణ కోసం ఎన్నో విధాలుగా కృషి చేస్తుంటారు. అటువంటి వారిని తొందరపడి శపించటం మంచిది కాదు అని చెప్పి పశ్చాత్తపుడై తన శిష్యులలో ఒకడయిన గౌరముఖుడు అనే పేరుగల శిష్యుడిని చేరపిలిచాడు. పరీక్షిన్మహారాజు వద్దకు వెళ్లి జరిగినది వివరించి శాపమునకు విరుగుడు లేదని, కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండవలసినదని చెప్పి ఆ శిష్యుడు ఆశ్రమానికి బయలుదేరాడు. తాను చేసిన పని ఎంతటి ప్రమాదం తెచ్చిపెట్టిందో అప్పుడు తెలిసివచ్చింది రాజుకు. 
 వెంటనే తన మంత్రులతో సమావేశమై పాము వంటి జంతువులు ప్రవేశించవీలులేనటువంటి ఒక ఒంటి స్తంభపు మేడ కట్టించుకుని అందులో తగిన రక్షణను ఏర్పాటు చేసుకొని కాలం గడుపుతున్నాడు. శుకమహర్షి చేత భాగవతాన్ని చెప్పించుకొని వినటం ప్రారంభించాడు. తక్షకుడి నుంచి తప్పించుకోవటానికి మంత్రతంత్రాలను ఏర్పాటు చేసుకొన్నాడు. ఒకవేళ అవి అన్నీ ఫలించక మరణం సంభవిస్తే భాగవతం విన్న పుణ్యఫలితమన్నా దక్కుతుందని అతని ఆలోచన. బ్రహ్మదేవుడిచేత సర్పాల విషాన్ని హరించే సంజీవిని విద్య పొందిన కశ్యపమహర్షి పరీక్షిన్మహారాజును రక్షించడానికి బయలుదేరాడు. కానీ దోవలో తక్షకుడు తన మాయచేత కశ్యపమహార్షిని వారించి అతని మనసును మార్చి వెనుకకు పంపినాడు. శృంగి శాపము ప్రకారము 7 రోజు సమీపించింది. ఆ రోజున సూర్యాస్తమయం అవుతుండగా తక్షకుడు కొంత మంది నాగకుమారులకు ముని బాలకుల వేషం వేసి కొన్ని అద్భుత ఫలాలనిచ్చి పరీక్షిత్తు దగ్గరకు పంపించాడు. రాజు సూర్యాస్తమయం అవుతున్నదని మరికొద్ది సేపటిలో తనకు శాపము నుంచి విముక్తి కలుగుతుందని భ్రమపడి మాయా మునిబాలకుల దగ్గర ఉన్న ఒక పండును తీసికొని చిదిమాడు. వెంటనే అందులో నించి చిన్న పురుగు రూపంలో ఉన్న తక్షకుడు బయటకు వచ్చి శృంగి శాప ప్రకారము పరిక్షిన్మహారాజు ప్రాణాలు తీశాడు.
Related Posts Plugin for WordPress, Blogger...